17, నవంబర్ 2017, శుక్రవారం

"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం

కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్.  అన్నయ్య సూర్య "సింగం" వరుస చిత్రాలతో ఈ ఫార్ములా ఉపయోగించి  హిట్ లు కొట్టగా,  ఇప్పుడు తమ్ముడు కార్తి అదే బాటలో పయనించి విజయంసాధించాడు.   1995 ప్రాంతంలో తమిళనాడులో జరిగిన వరుస హత్యానేరాల వాస్తవ నేపథ్యంతో రూపొందిన ఈ "ఖాకి" చిత్రం  తెలుగు,  తమిళ భాషలలో నేడు విడుదలై హిట్ టాక్ పొందడంతో  కార్తి చిత్రాలలోకెల్ల ఎక్కువ వసూళ్ళు రాబడుతున్న చిత్రంగా నిలిచే అవకాశం వున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  క్లిష్టమైన కేసులు పరిష్కరించడంలో పోలీసులు ఎంతగా శ్రమిస్తారో,  సహజత్వానికి వీలైనంత దగ్గరగ,  వుత్కంఠభరితంగా చిత్రీకరించడంలో దర్శకుడు కృతకృత్యుడయ్యడని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.  పోలీస్ ఆఫీసర్ గా కార్తి నటన, యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయంటున్నారు.  పోలీస్ తరహా యాక్షన్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు పసందైన కాలక్షేపం.     

8, నవంబర్ 2017, బుధవారం

రెండున్నర దశాబ్దాల అనంతరం నాగార్జున, వర్మల క్రేజీ కాంబినేషన్

తెలుగు చిత్ర రంగంలో ఒక ట్రెండ్ సెట్టర్ "శివ". నాగార్జున, వర్మల తొలి కలయికలో వచ్చిన ఈ చిత్ర ప్రభావం నేటి చిత్రాలలో ఇప్పటికీ కనిపిస్తుంటుంది. తరువాత వీరి కలయికలో అంతం, గోవిందా..గోవిందా.. చిత్రాలు వచ్చాయి. ఆ తదుపరి వర్మ బాలివుడ్ లో బిజీ అవడం, టాలివుడ్ కు తిరిగివచ్చినా పెద్ద చిత్రాలు ఏవీ చేయక పోవడంతో ఈ జోడీ కుదరలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల విరామం తరువాత నాగార్జున అభిమానుల కోరిక తీరనున్నది.  వర్మతో చిత్రాన్ని కంఫర్మ్ చేసిన నాగార్జున కొన్ని కండిషన్స్ వర్మ ముందుంచారు. ఈ సినిమా స్క్రిప్ట్ పై పూర్తి సమయం కేటాయించాలని, చిత్రం పూర్తి అయ్యే వరకు మరే ప్రాజెక్ట్ చేపట్టకూడదని నాగార్జున చెప్పిన మీదట వర్మ తన పూర్తి అంగీకారాన్ని తెలిపినట్లు తెలుస్తుంది.  ఇందులో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయనున్నారు.  ఈ నెలలోనే చిత్రం షూటింగ్ ప్రారంభం జరగనున్నది. 

7, నవంబర్ 2017, మంగళవారం

పది సంవత్సరాలు రాజశేఖర్ వేచిన విజయం "గరుడ వేగ"

 ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో డా. రాజశేఖర్ నటించిన "గరుడ వేగ" మంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ రాబడుతోంది. పది సంవత్సరాల క్రితం వచ్చిన "ఎవడైతే నాకేంటి" కమర్షియల్ విజయం తరువాత ఇప్పటి వరకు సరైన విజయం దక్కలేదు రాజశేఖర్ కు. సినీ రంగ పరంగానే కాకుండా, రాజకీయంగా, సామాజికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు రాజశేఖర్ ఈ మద్య కాలంలో. ఇటీవలనే తల్లి చనిపోవడం మరి కొన్ని అనవసర వివాదాలతో సతమతమౌతున్న రాజశేఖర్ కు, అతని కుటుంబానికి ఇది అద్భుతమైన వుత్సాహాన్ని ఇస్తున్న విజయం. ఇది పూర్తిగా దర్శకుడు ప్రవీణ్ సత్తార్ క్రెడిటేనంటున్నారు పరిస్రమ పెద్దలు. రాజశేఖర్ స్థాయికి మించిన బడ్జెట్ పెట్టి, మళ్ళీ అప్పటి యాంగ్రి హీరొ ఇమేజ్ ను పునరుద్దరించారని మెచ్చుకుంటున్నారు. ఎన్ ఐ ఏ ఏజెంట్ గా తన స్టైల్ నటనతో, యువ హీరోలా పరిస్రమించి పాత్రకు న్యాయం చేకూర్చారు రాజశేఖర్. ఈ చిత్రం రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది గా ప్రస్థావిస్తున్నారు.      

2, నవంబర్ 2017, గురువారం

మరోసారి సెంటిమెంట్ ప్రయోగించిన బాలకృష్ణ

గతంలో నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ, సింహా చిత్రాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్న బాలకృష్ణ మరోసారి తన 102 వ చిత్రానికి "జై సిం హా" టైటిల్ నిర్ణయించడం ద్వారా సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇచ్చారు.  సి. కల్యాణ్ నిర్మాతగా కె.ఎస్. రవి కుమార్ దర్శకత్వంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రం బాలకృష్ణకు మరో సెంటిమెంట్ అయిన సంక్రాంతికి విడుదల కానుండడం ఆయన అభిమానులకు పండుగే. "పైసావసూల్" అపజయం మరపించేలా, ఈ చిత్రం సూపర్ హిట్ అయి రెండు సెంటిమెంట్లను రుజుచేస్తుందని బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది.

20, అక్టోబర్ 2017, శుక్రవారం

రవితేజ కొత్తగా ట్రై చేసిన "రాజ ది గ్రేట్"

నటనలోనే కాదు, సినిమాలు చేయడంలోను దూకుడు మీద వుండే రవితేజ - రెండు సంవత్సరాల విరామం అనంతరం విడుదలైన చిత్రం "రాజ ది గ్రేట్".  12 సంవత్సరాల తరువాత దిల్ రాజు తో రవితేజ చేసిన చిత్రంగా కూడా ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించిన కలయిక ఇది.  పటాస్, సుప్రీం చిత్రాలతో జోరు మీద వున్న అనిల్ రావిపూడి దీనికి దర్శకుడు.  రొటీన్ కథకు వెరైటీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం వర్క్ అవుట్ అయిందనే అంటున్నారు ప్రేక్షకులు.  మాస్ మహారాజాగా మన్ననలు పొందుతున్న రవితేజలాంటి హీరో చేత పూర్తి నిడివి  అంధత్వంగల పాత్ర  చేయించడమన్నది ప్రయోగమే. అయినప్పటికి ఆ పాత్రపై ప్రేక్షకులకు సింపతీ ఏర్పడకుండా జోష్ మీద నటించి క్రెడిట్ కొట్టేసాడు రవితేజ.  చాల గాప్ తరువాత వచ్చినా న్యూ లుక్ తో, ఫుల్ ఎనర్జిటిక్ గా చేసాడని యూత్ ఆడియన్స్ కితాబిస్తున్నారు.  ఇన్ని రోజుల  విరామం  తీసుకున్నది మొనాటని బ్రేక్ చేయడానికే అన్న రవితేజ మాటలలాగే ఈ చిత్రం "రవి తేజ వన్ మాన్ షో" అనిపించుకుంటుంది. రవితేజ ను 50 కోట్ల కలెక్షన్స్ లో చేర్చే మొట్ట మొదటి చిత్రం ఇదే కావచ్చు అంటున్నారు విశ్లేషకులు.   

17, అక్టోబర్ 2017, మంగళవారం

తారాబలమే నిలిపిన "రాజుగారి గది2"

దర్శకుడు ఓంకార్ "రాజుగారి గది" చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్నే సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలో వుండగానే పి.వి.పి సంస్థ, నాగార్జున అందులో పాలు పంచుకోవడానికి సిద్ద పడడంతోటే పెద్ద చిత్రంగా ప్రణాళిక రూపుదిద్దుకొంది "రాజు గారి గది2". అందరూ చిన్న స్థాయి నటులే అయినా - మంచి కామెడి,సస్పెన్స్,హారర్ తో ప్రేక్షకులను అలరించి సొమ్ము చేసుకుంది "రాజుగారి గది". నాగార్జున- సమంతల చేరికతో పెద్ద చిత్రంగా, కొన్ని అంచనాల మద్య విడుదలైన "రాజుగారి గది2" ఓపినింగ్ కలెక్షన్స్ బాగానే రాబట్టుకోంది. మొదటి చిత్రంలోలా కామెడి, హారర్ లు పెద్దగా ఆకట్టుకోలేక పోయినా, నాగార్జున-సమంతలే సినిమాను నిలబెట్టారంటున్నారు ప్రేక్షకులు. చిన్న నటులతో ఎంతో స్వేచ్చగా తీయగలిగిన దర్శకుడు ఓంకార్, పెద్ద నటుల ప్రవేశంతో హ్యూమర్, సస్పెన్స్,థ్రిల్లర్ లను అనుకున్నంతగా బ్యాలెన్స్ చేయలేక పోయాడంటున్నారు విశ్లేషకులు. ఏవరేజ్ టాక్ తో సేఫ్ ప్రాజెక్ట్ గా నిలుస్తుంది.

11, అక్టోబర్ 2017, బుధవారం

అలుపేలేని నటనకు కేరాఫ్ అడ్రస్

సాధారణంగా ఏ ఉద్యోగానికైనా రిటైర్మెంట్ వయసు 58-60 సంవత్సరాలు.  ఆ లెక్కన చూసుకుంటే అమితాబ్ బచ్చన్ రిటైర్ అయి 15 సంవత్సరాలు అవుతుంది.  75 సంవత్సరాల వయసులో కూడా 25  సంవత్సరాల కుర్రాడిలా ఇటు సినిమాలు,  అటు టి.వి షోలతో బిజీగా వున్నారు. 1969లో చిత్ర రంగ ప్రవేశం చేసిన అమితాబ్, సాథ్ హిందుస్థానీ చిత్రంతో మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను అందుకున్నారు. 1973లో వచ్చిన "జంజీర్" అమితాబ్ కు స్టార్డం తెచ్చి పెట్టింది. అదే సంవత్సరం జయభాధురితో వివాహం జరిగింది.1975 సంవత్సరం అమితాబ్ కు గొప్ప మలుపు ఇచ్చిన సంవత్సరంగా నిలిచిపోయింది. "దీవార్" తో మరోసారి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకోవడమే కాకుండా "షోలే" రూపంలో భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన బంపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. సూపర్ స్టార్ ఇమేజ్ తో పాటు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలివుడ్ లో అమితాబ్ కు ఎదురేలేక పోయింది. 1982 లో "కూలీ" షూటింగ్ సందర్భంగా తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి విజయుడిగా  నిలిచారు. సాక్ష్యాత్ దేశ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి అమితాబ్ చికిత్సపై డాక్టర్స్ ను ప్రత్యేకంగా సంప్రదించారంటే అమితాబ్ ప్రాముఖ్యత అర్ధమౌతుంది. ఇందిరా గాంది మరణం తదుపరి ఆమె కుమారుడు రాజీవ్ గాంధి విజ్ణప్తి పై కాంగ్రెస్ పార్టీలో చేరి,  ఉత్తర్ ప్రదేశ్ నుండి ఎం.పి గా ఎన్నికయ్యారు. రాజకీయాలు తనకు సరిపడని అంశమని కొద్ది కాలంలోనే బయటకు వచ్చేసారు.   సెకండ్ ఇన్నింగ్స్ లో "షెహన్ షా", "హం", "అగ్నిపత్", "ఖుదాగవా"  చిత్రాలతో తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. "అగ్నిపత్" లో నటనకు గాను మొట్ట మొదటిగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. తరువాత కొన్ని పరాజయాలు పలకరించడంతో మళ్ళీ విరామం తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో అమితాబ్ ప్రారంభించిన "ఎబిసిఎల్" మొదట్లో బాగానే వున్నా, తదుపరి తీవ్ర నష్టాలలో కూరుకు పోయింది. మరల 2000 నుండి వయసు మీరిన పాత్రలతో నటిస్తుండడం, మరో ప్రక్క "కౌన్ బనేగా కరోడ్పతి" టివి షో వ్యాఖ్యాతగా విషేషంగా రాణిస్తూ ఆర్ధికంగా కూడా నిలదొక్కుకున్నారు. 2005లో "బ్లాక్", 2008 లో "పా", 2015 లో "పీకు" చిత్రాలలోని పాత్రలకుగాను బెస్ట్ ఏక్టర్ గా నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. మొత్తంగా నాలుగు నేషనల్ అవార్డ్స్,  పదిహేను ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తీసుకోవడమే కాకుండా, "సూపర్ స్టార్" అన్న పదానికి సార్ధకత చేకూర్చారు అమితాబ్. నేడు 75 వ జన్మదినం జరుపుకొంటున్న అమితాబ్ కు భారతీయ సినీ పరిశ్రమ ఘనంగా శుభాకాంక్షలు పలుకుతుంది.       

8, అక్టోబర్ 2017, ఆదివారం

వ్యక్తిగత జీవితంలోనూ తండ్రి నాగార్జున నే అనుసరించిన చైతన్య

"ఏ మాయ చేసావె" చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేసిన అక్కినేని నాగ చైతన్య, సమంతలు నిజ జీవితంలో కూడా ప్రేమ పెళ్ళితో ఒక్కటయ్యారు. కీ. అక్కినేని నాగేశ్వరరావు అంతగా చదువుకోకపోయినా, విశాల దృక్పథం కలిగి, సినీ పరిశ్రమలో ఆదర్శప్రాయ జీవితం గడిపారు.తన కుమారుల ఇష్టాలను గౌరవించి,  వారికి తమ జీవితాలను తీర్చి దిద్దుకోవడంలో పూర్తి స్వేచ్చను ఇచ్చారు. ఆ స్వేచ్చతోనే నాగార్జున సినిమా హీరోగా నిలదొక్కుకోని, తనతోపాటు హీరోయిన్ గా  నటించిన అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు నాగార్జున అదే స్వేచ్చను తన కుమారుడు చైతన్యకు కూడా వారసత్వంగా ఇచ్చారు. తొలుత ప్రొఫెషనల్ రేస్ కార్ డ్రైవర్ గా రాణించడానికి ఇష్టపడిన చైతన్య, తదుపరి సినిమాలపై ఆసక్తితో హీరోగా రూపాంతరం చెందాడు. తండ్రి నాగార్జున బాటలోనే పయనిస్తూ- తన తొలి చిత్ర నాయకి సమంతతో ప్రేమలో మునిగి, ఇరు పెద్దల అంగీకారంతో  ఆమెను  అర్ధాంగిగా  చేసుకున్నాడు.. అమితాబ్-జయభాదురి, కృష్ణ-విజయనిర్మల, నాగార్జున-అమల, రాజశేఖర్-జీవిత, అజిత్-షాలిని, సూర్య-జ్యోతిక తదితర సినీ దంపతులులా వీరు కూడా చిరకాలం దాంపత్యం సాగించాలని ఆకాంక్షిద్దాం, ఆశీర్వదిద్దాం. 

5, అక్టోబర్ 2017, గురువారం

2, అక్టోబర్ 2017, సోమవారం

ఎన్ టి ఆర్ జీవిత చిత్రాల మధ్య రగులుతున్న వివాదం

సినిమా రంగంలోనే కాకుండా, రాజకీయ రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. కోట్లాది ప్రేక్షకుల, ప్రజల ఆరాధ్య దైవంగా కొలవబడిన మనిషి.  అటువంటి వ్యక్తి జీవత చరిత్రపై ప్రస్తుతం నిర్మాణం కానున్న చిత్రాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.  మొదటిగా ఎన్ టి ఆర్ కుమారుడు బాలకృష్ణ తన తండ్రి ఎన్ టి ఆర్ జీవిత కథను తనే హీరోగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. స్వతహాగానే కుటుంబం అంతా మద్దతు ప్రకటించారు.  లక్ష్మీ పార్వతి మాత్రం దీనిపై సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.  ఈ చిత్రంలో తననే విలన్ గా చూపే ప్రయత్నం జరుగుతుందని ఆమె ఆందోళన పడుతున్నారు. ఎన్ టి ఆర్ కుటుంబ కోణంలో చూస్తే లక్ష్మీ పార్వతి ప్రవేశం అన్నది ఎన్ టి ఆర్ పతనానికి నాందీవాచకం.  ఇటువంటి సమయంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ "లక్ష్మీస్ ఎన్ టి ఆర్" చిత్రాన్ని ప్రకటించడమే కాకుండా,  ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడం ఎన్ టి ఆర్ కుటుంబ సభ్యులలో కలవరం రేకెత్తిస్తుంది.  ఇది లక్ష్మీ పార్వతి కోణంలో తీస్తున్న చిత్రం కాబట్టి, ఎన్ టి ఆర్ కుటుంబ సభ్యులు పై వ్యతిరేక ప్రభావం ఏర్పడేలా చిత్రీకరణ జరుగుతుందని వారు  ఆందోళన చెందుతున్నారు.  బాలకృష్ణ చిత్రం ఇంకా కథా చర్చలలోనే వుంది.  కానీ రాంగోపాల్ వర్మ తలచుకుంటే నెల రోజులలోనే తన సినిమా పూర్తి చేసి జనంలోకి వదిలేయగలడు.  వివాదాస్పద అంశాలు, ఘటనలే రాంగోపాల్ వర్మకు ప్రచార సాధనాలు,  ఆదాయ వనరులు.  ఎవరి మనోభావాలు, అభిప్రాయాలతోను పనిలేకుండా తను అనుకున్నది తీయడమే వర్మ నైజం.  ఈ చిత్రానికి లక్ష్మీ పార్వతి తెరవెనుక నిర్మాతగా వ్యవహరిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినవస్తున్నాయి. ఎవరి చిత్రం వాస్తవానికి దగ్గరగా వుండి ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 

30, సెప్టెంబర్ 2017, శనివారం

శర్వానంద్ ఖాతాలో మరో హిట్ "మహానుభావుడు"

ఈ ఏడాది సంక్రాంతికి "శతమానంభవతి"లాంటి  మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో బోణీ కొట్టిన  శర్వానంద్ ను , తదుపరి "రాధా" రూపంలో అపజయం పలకరించింది. హాస్యానికి పెద్ద పీట వేసి విజయాలు దక్కించుకొంటున్న  మారుతి   దర్శకత్వంలో శర్వానంద్ నటించిన తాజ విడుదల "మహానుభావుడు" హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అతి శుబ్రత అనే విపరీత మనస్థత్వంతో, వింత వింత విన్యాసాలు చేసే హీరో పాత్రలో చక్కగా ఒదిగిపోయాడని శర్వానంద్ ను ప్రశంసిస్తున్నారు. "గమ్యం", "ప్రస్థానం" చిత్రాల ద్వారా మంచి ప్రతిభ గల యువ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, "రన్ రాజా రన్". "ఎక్స్ ప్రెస్ రాజా", "రాజాధి రాజా" చిత్రాలలో తనలోని హాస్య రస పోషణను  కూడా  నిరూపించుకున్నాడు. సంక్రాంతికి విడుదలైన "శతమానంభవతి" ఓవర్ ఆల్ గా 50 కొట్ల కలెక్షన్స్ వసూలు చేసి హీరోగా శర్వానందుకు సరి కొత్త మార్కెట్ ను తెచ్చిపెట్టింది.  రెండు భారీ చిత్రాల మధ్య దసరాకు విడుదలైన "మహానుభావుడు" 35 - 40 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని పరిశ్రమ వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏ సంకోచం లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా భరొసా ఇస్తున్నారు ప్రేక్షకులు.

29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు అందుకున్న "స్పైడర్"


                                                                                                                                                                                                                          భారీ చిత్రాల దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్,  తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్లో ద్విభాషా చిత్రంగా విడుదలైన "స్పైడర్" చక్కని కలెక్షన్స్ రాబడుతుంది.  ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చినా, కలెక్షన్స్ మాత్రం భారీగానే కొల్లగొడుతుంది. రెండు రోజులకే 85 కోట్లు సుమారు వసూలు చేసి, 100 కోట్ల దిశగా పయనిస్తుంది.  హీరో, విలన్ పాత్రల వైవిద్య సృష్టి, చిత్రీకరణ, సాంకేతిక హంగుల వినియోగంలో అంతర్జాతీయ స్థాయి పని తీరు కనబరిచాడు దర్శకుడు మురుగ దాస్.  ప్రాంతీయ భాషా అగ్ర హీరోల హీరోయిజంపై ఒక బలమైన ముద్ర ఏర్పడి పోయి వున్న మాస్ ప్రేక్షకులలో ఈ వినూత్న తరహాపై భిన్న స్వరాలు వినిపించాయి.  తాజాగా సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాన్ని ప్రశంసలలో ముంచెత్తడం ప్రాధాన్యత సంతరించుకుంది.  మంచి సందేశాన్ని అత్యున్నత రీతిలో దర్శకుడు మురుగ దాస్ మలిచారని, మహేష్ చక్కని పెర్ఫార్మెన్స్ చేశాడని,  మొత్తం స్పైడర్ టీంకు అభినందనలు తెలుపుకుంటున్నానని రజనీకాంత్ అన్నారు. ఇది "స్పైడర్" కు లభించిన అమూల్యమైన గౌరవం. వారాంతం, దసరా సెలవులు టాక్ తో సంబందం లేకుండా కలెక్షన్స్ రాబట్టడానికి దోహదం చేస్తున్నాయి.       

25, సెప్టెంబర్ 2017, సోమవారం

బాహుబలి తదుపరి స్థానం దిశగా జై లవకుశ

జూ. ఎన్ టి ఆర్ తొలిసారిగా మూడు పాత్రలలో సమర్ధవంతంగా  నటించిన "జై లవ కుశ" సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.  నాలుగు రోజులలోనే  100 కోట్ల కలెక్షన్స్ చేరువైన ఈ చిత్రం రానున్న రోజులలో తెలుగులో భాహుబలి తదుపరి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ప్రస్తుతం  చిరంజీవి "ఖైదీ నెంబర్ 150" తెలుగులో సుమారు 160 కోట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో ప్రవేశించినందున, దసరా సెలవులు కావడం ఈ సినిమాకు బాగా కలసి వచ్చింది. ఈ వారం విడుదల కానున్న మహేష్ బాబు "స్పైడెర్" రెస్పాన్స్ కూడ "జై లవ కుశ" వసూళ్ళ గణాంకాలను ప్రభావితం చేసే అవకాశం వుంది. ప్రస్తుత పరిస్థితి బట్టి 150 కోట్లు వసూళ్ళు చేస్తుందనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. వరుసగా నాలుగవ చిత్రం విజయం సాధించడం, మరో ప్రక్క వ్యాఖ్యాతగా వ్యవహరించిన "బిగ్ బాస్" టి వి రియాలిటి షో గ్రాండ్ సక్సెస్ కావడంతో  జూ. ఎన్ టి ఆర్ మంచి జోష్ మీద వున్నారు.   

17, సెప్టెంబర్ 2017, ఆదివారం

దసరాకు సందడి చేయనున్న అగ్ర హీరోలు

బాహుబలి 2 తదుపరి విడుదలైన పెద్ద సినిమాలు దువ్వాడ జగన్నాదం, పైసా వసూల్ పరిశ్రమకు వసూళ్ళ వుత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ మద్యలో నిన్నుకోరి, ఫిదా, నేనే రాజు నేనే మంత్రి, ఆనందో బ్రహ్మా, అర్జున్ రెడ్డి లాంటి చిన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ ను కొంచెం కళ కళ లాడించాయి. ఇప్పుడు మళ్ళీ బాక్సాఫీస్ రికార్డ్ లెక్కలను సవరించుకొనే సమయం వచ్చేసింది. జూనియర్ ఎన్ టి ఆర్ తొలిసారిగా కుటుంబ సంస్థ ఎన్ టి ఆర్ ఆర్ట్స్ లో రవీంద్ర దర్శకత్వంలో నటించిన "జై లవ కుశ" ఈ నెల 21 న విడుదల కానుంది. ఇందులో ఎన్ టి ఆర్ మూడు పాత్రల లో నటించడం విశేషం. అదే విధంగా మహేష్ బాబు, ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో నటించిన"సైడర్" కూడా ఈ నెల 27 న విడుదలకు రంగం సిద్దం అయ్యింది.  బాహుబలి 2 తదుపరి అత్యధిక వ్యయంతో తెలుగులో నిర్మితమైన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఒకేసారి తెరపంచుకొంటోంది. దసరాకు కనుల విందుకు సిద్ధమైన ఈ చిత్రాలు - టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్ కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్ లను నెలకొల్పడం ఖాయం అంటున్నాయి  పరిశ్రమ వర్గాలు.    

7, సెప్టెంబర్ 2017, గురువారం

2000 కు పైగా సినిమాలను పంపిణీ చేసి చరిత్ర సృష్టించిన ఉషాపిక్చర్స్ (ఏలూరు)

1972 లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలో ప్రవేశించింది వి.వి. బాలకృష్ణారావు యాజమాన్యంలోని ఉషాపిక్చర్స్ (ఏలూరు). ఆనాటి నుండి ఎంతో క్రమశిక్షణ, మరెంతో అంకిత భావంతో అంచెలంచెలుగా ఎదుగుతూ, ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని విజయప్రస్థానాన్ని కొనసాగిస్తూంది. ప్రముఖ పంపిణీ సంస్థలుగా పేరుగడించిన ఎన్నో సంస్థలు ఈ రంగంలోని అనిశ్చిత పరిస్తితుల  కారణంగా కనుమరుగైనా,  నాలుగున్నర దశాబ్ధాలుగా అప్రతిహతంగా పయనిస్తుంది. గతంలో 5,6 చిత్రాలు అపజయంపాలు అయినా,  ఒక చిత్రం విజయంసాధిస్తే నష్టాలు భర్తీ అయిపోయేవని - నేడు 5,6 చిత్రాలు విజయం సాధించినా, ఒక చిత్రం అపజయంతో మొత్తంగా దివాళా తీసే పరిస్థితులు  నెలకొన్నాయని ఈ పంపిణీ రంగంలోని వారు అంటున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో కూడా అత్యధిక చిత్రాలను పంపిణీ చేసిన సంస్థగా " లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ " లో స్థానం సంపాధించింది ఈ సంస్థ.  ఉషా గ్రూప్స్ కు ఫైనాన్స్, హోటల్, ఆగ్రో తదితర సంబందిత వ్యాపారాలు ఉన్నా యజమాని బాల కృష్ణా రావు కు సినిమా పంపిణీ, ప్రదర్శన రంగాలపైనే  విపరీతమైన ప్రేమ.  రాష్ట్ర ఫిలిం చాంబర్ అధ్యక్షులుగా,మరియు మరెన్నో పరిశ్రమకు సంబందించిన కీలక పదవులను సమర్ధవంతంగా నిర్వహించారు. స్వగ్రామం కొవ్వలి లోను, జిల్లా కేంద్రం ఏలూరు లోను ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేస్తూ ప్రజల మన్ననలను అందుకుంటున్నారు. అదే విధంగా వందలమందికి ఉపాధి కల్పిస్తూ ఆ కుటుంబాల ఆశీస్సులను పొందుతున్నారు వి.వి. బాలకృష్ణా రావు.  

2, సెప్టెంబర్ 2017, శనివారం

ప్రేక్షకుల నుండి "పైసా వసూల్" అయ్యేనా!

 100 వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తదుపరి నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్ తో చిత్రం అనౌన్స్ చేయగానే పరిశ్రమలో   తీవ్ర  ఆసక్తి  నెలకొంది.  ఇద్దరూ డిఫరెంట్ స్కూల్స్ అవడంతో ఎవరు ఎవరి శైలి ఫాలో అవుతారో అన్న ఉత్కంఠకు శుక్రవారంతో తెర పడింది. "పైసా వసూల్" లో బాలకృష్ణను డిఫెరెంట్ గా చూపడంలో పూరీ కృతకృత్యుడయ్యాడు.  కాకపోతే పూరీ మాత్రం తన మూస ధోరణి నుండి బయటపడలేక,  సినిమా అంతా తన గత చిత్రాల వాసనలతో నింపేశాడంటున్నారు.  ఫస్ట్ హాఫ్ ను రసవత్తరంగా మలచినా,  సినిమాకు ప్రాణం అయిన సెకండ్ హాఫ్ ను ఆ మేరకు రక్తి కట్టించలేక పోయాడు.  పూరీ చిత్రాలలో చిత్రం జయాపజయాలకు అతీతంగా, హీరోయిన్, విలన్ పాత్రలు, సాంగ్స్ కు ప్రత్యేకత వుంటుంది.  ఈ చిత్రంలో వాటికీ   న్యాయం చేయలేక పోయాడంటున్నారు.  బాలకృష్ణలాంటి సీనియర్ హీరో పూరి దర్శకత్వంలో ఎటువంటి భేషజం  లేకుండా   ఒదిగిపోయి నటించడమన్నది అభినందించాల్సిన విషయం.  ఫైనల్ గా "పైసా వసూల్"  ఫక్తు బాలకృష్ణ అభిమానుల చిత్రంగా తేల్చేశారు ప్రేక్షకులు.  

30, ఆగస్టు 2017, బుధవారం

ఆ కుటుంబానికి సినిమాయే ప్రపంచం, ప్రేమ, ప్రాణం.

ఎవరైనా సినిమా రంగాన్ని ప్రొఫెషన్ గా ఎంచుకుంటాను అంటే చుట్టు ప్రక్కల వారి ప్రతిస్పందన ఎలా వుంటుంది? పోయి,పోయి ఇదేం నిర్ణయం రా బాబు అంటుంటారు సాధారణంగా.  ఎందుకంటే ఆ రంగంలో స్థిరత్వం సాదించడమన్నది బహు కష్టం.   వేలాది మంది సంవత్సరాలుగా కష్టపడుతున్నా,  వారిలో పదుల సంఖ్యలో గుర్తింపు తెచ్చుకోవడం గఘనం అవుతుంది.  ఒక వేళ విజయం సాధించినా అది నిలబెట్టుకోవడం మరో యజ్ఞం. విజయాలే కొలమానం ఇక్కడ. వరుస విజయాలు సొంతమౌతున్నా,  ఒక్క అపజయం జీవితాలను తారు మారు చేస్తుంది. అందుకే సినీ పరిశ్రమకు వెళ్ళాలనుకునే వారికి అంతగా ప్రోత్సాహం లభించదు.  అటువంటిది కుటుంబానికి కుటుంబమే సినిమా రంగంతో మమేకమైపోయి, అంతర్జాతీయ స్థాయి   చిత్రాలను అందించి దేశమే గర్వపడేలా చేస్తున్నారు.  ఆ కుటుంబమే ఎస్.ఎస్.రాజమౌళి కుటుంబం.  తొలుతగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితగా నిలదొక్కుకున్నారు. తదుపరి అన్నయ్య ( పెద్దమ్మ కుమారుడు ) ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా పేరుగడించారు. ఆ మార్గంలోనే పయనించి సోదరి ఎం.ఎం. శ్రీలేఖ సింగర్,మ్యూజిక్ డైరెక్టర్ గా స్థిరపడింది. తరువాత రాజమౌళి దర్శకుడుగా,మరో సోదరుడు కల్యాని మాలిక్ సంగీత దర్శకుడుగా రాణిస్తున్నారు. కీరవాణి భార్య శ్రీ వల్లి లైన్ ప్రొడ్యూసర్, రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూం డిజైనర్ గా వారి వంతు పాత్రలు పోషిస్తున్నారు. ఇక కీరవాణి కుమారుడు కాల భైరవ సింగర్ గా (దండాలయ్యా..బాహుబలి సాంగ్),  రాజమౌళి కుమారుడు కార్తికేయ అసిస్టెంట్ డైరెక్టర్, కాస్ట్యూం డిసైనింగ్, ప్రొడక్షన్ విభాగాలలో పనిచేసి ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా స్థిరపడుతున్నారు. రాజమౌళి మరో కజిన్ ఎస్.ఎస్.కంచి టివి,సినిమాల రచయిత- నటుడుగా కొనసాగుతూనే ఇటీవల దర్శకుడిగా కూడా మారాడు.  ఇలా రాజమౌళి కుటుంబం మొత్తం సినిమాయే జీవితంగా కొనసాగుతూ "బాహుబలి" లాంటి అంతర్జాతీయ స్థాయి చిత్రాలను దేశానికి అందించారు. మనం చేసే పనిపై దృఢమైన నమ్మకం,శ్రద్ధ, అంకితభావం వుంటే ఎంతటి విజయాలు సొంతం అవుతాయో నిరూపించారు.    

25, ఆగస్టు 2017, శుక్రవారం

ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరమైన " అర్జున్ రెడ్డి"

ఏవడే సుబ్రహ్మణ్యం, పెళ్ళి చూపులు, ద్వారక  చిత్రాలతో మరో మంచి యువ కథానాయకుడుగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజా చిత్రం " అర్జున్ రెడ్డి " భారీ అంచనాల మద్య విడుదలైంది. 1.50 కోట్ల బడ్జెట్ చిత్రాన్ని, ఎక్స్లెంట్ ప్రమోషన్,  హైప్ క్రియేషన్ తో 6 కోట్ల బిజినెస్ చేసిన నిర్మాతలు - ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేక పోయారు  అని పరిశ్రమ వర్గాలు  అంటున్నాయి.  అగ్ర హీరొల రేంజ్ లో ఈ సినిమా విరివిగా ప్రీమియర్ షోలు ప్రదర్శింపబడింది.  సినిమాకు సెన్సార్ బోర్డ్ వారు "ఏ" సర్టిఫికెట్ ఇవ్వడంలో ఏ మాత్రం తప్పులేదంటున్నారు ప్రేక్షకులు.  కేవలం యూత్ ని దృష్టిలో పెట్టుకొని తీసిన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్ సహనాన్ని పరిక్షించేవిగా వున్నాయంటున్నారు. ఇప్పటికీ "ఫిదా" లాంటి హృద్యమైన ప్రేమ కథ చూసిన మూడ్ లోనే వున్న తెలుగు ప్రేక్షకులు ఈ విపరీత భగ్న ప్రేమను ఎంత వరకు ఆదరిస్తారు అన్నది అనుమానాస్పదమే. డబ్బింగ్ చిత్రాలు వివేకం, వీఇపి 2 లు పూర్తిగా నిరాశపరచడం, పండుగ  సెలవులు  " అర్జున్ రెడ్డి " కి మంచి రెవెన్యూ సాధించి పెడుతున్నా, సోమవారం నుండి కలెక్షన్స్ పై తీవ్ర ఆందోళనలో వున్నారు పంపిణీదారులు.  అర్జున్ రెడ్డి ఆశాభంగం తదుపరి చిన్న చిత్రాల మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు వున్నాయంటున్నాయి వాణిజ్య శ్రేణులు.     

24, ఆగస్టు 2017, గురువారం

సైరా నరసింహారెడ్డి లో అమితాబ్

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా నిర్మితం కానున్న చిత్రానికి" సైరా నరసింహారెడ్డి " గా పేరు ప్రకటించారు. తొలి స్వాతంత్ర్య పోరాట యోధుడుగా వినుతికెక్కిన వుయ్యలవాడ  నరసింహారెడ్డి  వీరగాధను నిజానికి చిరంజీవి 150 వ చిత్రంగా అనుకున్నా, కార్య రూపం దాల్చ లేదు. సురేందర్ రెడ్డి దర్శక భాద్యతలు వహిస్తున్న ఈ చిత్రం బాహుబలి తదుపరి అత్యధిక వ్యయం కానున్న తెలుగు చిత్రంగా నిలవబోతున్నది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కీలక పాత్ర పోషించనుండగా, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార తదితర అగ్ర తారాగణం ఇప్పటికి ప్రకటించబడిన తారాగణం. వివిధ ప్రాంతీయ భాషలతో పాటుగా హిందీలో కూడా విడుదల చేయాలన్న ఆలోచన కారణంగా మరింత మంది భారీ తారాగణం ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కొలువుతీరనున్నారు. ఏ.  ఆర్. రెహమాన్ సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ కానున్నది.     

8, ఆగస్టు 2017, మంగళవారం

సినిమాలకు తాత్కాలిక విరామం ఆలోచనలో "పవన్ కళ్యాణ్"....!

                 2014 ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినా, సంస్థాగత నిర్మాణం జరగనందున అప్పటి ఎన్నికలలో TDP + BJP కూటమికి పరోక్ష మద్దతు ప్రకటించి వారి విజయం లో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత కూడా సినిమాలు చేస్తూనే - మరోప్రక్క అవసరమైన సందర్బాలలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. 2019 ఎన్నికలలో జనసేన ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ - ఆ దిశలో మొదటి అడుగుగా జిల్లా స్థాయి నుండి క్యాడర్ ను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. ఒకప్రక్క సినిమాలు, మరోప్రక్క పార్టీ సంస్థాగత నిర్మాణం వ్యవహారాలు చూసుకోవడం పవన్ కు క్లిష్టతరంగా మారింది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న చిత్రం షెడ్యూల్  కూడా ఇందువలనే ఆలస్యం అవుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జనసేన పార్టీ వ్యూహరచనలో తెరవెనుక ప్రదాన పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. ఎన్నికల రంగానికి మరి ఎంతో సమయం లేనందున ప్రస్తుత చిత్రం పూర్తి అయిన తదుపరి మరి ఏ సినిమా చెయ్యకూడదు అన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ వున్నట్లుగ సన్నిహిత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ నిర్ణయమే నిజమైతే ప్రస్తుత చిత్రం తరువాత మరో మూడు నాలుగు సంవత్సరాల వరకు పవన్ చిత్రం వుండే అవకాశం లేదు. ఇది పవన్ అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమకు ఎంతో నిరాశ కలిగించే విషయమే. కాకపోతే అభిమానులు మాత్రం పవన్ ను తరచుగా, ప్రత్యక్షంగా ప్రజల మధ్యే చూసుకొని మురిసిపోవచ్చు సుమా...!!


5, ఆగస్టు 2017, శనివారం

సునీల్ కు ఎంత పని చేసావు "మర్యాద రామన్న" ..?

2000 సంవత్సరంలో చిత్ర పరిశ్రమకు పరిచయమైన సునీల్ దాదాపు దశాబ్దం పాటు హాస్య చక్రవర్తిగా ఒక వెలుగు వెలిగాడు. పరిశ్రమకు వచ్చిన సంవత్సర కాలానికే వుత్తమ హాస్య నటుడిగా ( నువ్వు నేను ) రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం అందుకున్నాడు. దర్సకుడు త్రివిక్రం శ్రీనివాస్, సునీల్ ఒక వూరి (భీమవరం) వాళ్ళే. అందులోనూ  కాలేజ్ మిత్రులు కావడంతో - పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో కూడా ఒకే రూంలో వుండే వారు. త్రివిక్రం మాటల రచయతగా అవకాశాలు  దక్కించుకొవడానికి సునీల్ సహాయపడగా - సునీల్ కు తను చేస్తున్న దర్శకులకు చెప్పి పాత్రలు ఇప్పించడానికి త్రివిక్రం  దోహదపడ్డారు. . అప్పటికే సినీ హాస్య ప్రపంచాన్ని దశాబ్దంపైగా మకుటంలేని మహారాజులా  ఏలుతున్న  బ్రమ్హానందంకు తగ్గ వారసుడు  వచ్చాడని  ప్రేక్షకులు ఆనందించారు. ప్రతి దర్శకుడు,హీరో తమ చిత్రంలో సునీల్ వుండాలని ప్రత్యేకించి పాత్రలు సృష్టించేవారు. సంవత్సరానికి 20-25 సినిమాలు చేసే పరిస్తితులు  వుండేవి.  తనదైన ప్రత్యేక మేనరిసంతో పాత్రలకు మరింత న్యాయం  చేకూర్చే వాడు. 2006 సంవత్సరంలో "అందాలరాముడు"గా  హీరోగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం  చేసుకున్నాడు. ఆ తదుపరి కూడా హాస్య పాత్రలే  చేసుకుంటు  వచ్చాడు. 2010 లో రాజమౌళి దర్శకత్వం లో సునీల్ హీరొగా వచ్చిన "మర్యాద రామన్న" సూపర్ హిట్ కావడం - సునీల్ హాస్య శకానికి ముగింపు పలికిందని చెప్పొచ్చు. అభిమానుల  ఆకాంక్షో, శ్రేయోభిలాషుల   సలహానో, లేక సునీల్ స్వంత నిర్ణయమోగాని - అప్పటినుండి సునీల్ పూర్తి స్థాయి హీరొగా నిలదొక్కుకోవాలనే దిశలో నెమ్మదిగా, పూర్తిగా హాస్య పాత్రలకు ఫుల్ స్టాఫ్ పెట్టేశాడు. హాస్య నటులు హీరొలుగా ప్రయత్నించడం అన్నది అనాదిగా వస్తున్నదే అయినా, ఎవరూ పూర్తిస్థాయిలో హీరోలుగా నిలదొక్కుకోలేదు.

 చంద్ర మోహన్, రాజేంద్రప్రసాద్, నరెష్, శ్రీకాంత్ తదితరుల పరిస్తితి వేరు. వారు ముందు హీరొలుగా నిలదొక్కుకొని తదుపరి హాస్య కదానాయకులుగా ఆదరణ  పొందారు. నాటి రేలంగి,పద్మనాభం,చలం,రాజబాబులు నుండి నేటి బ్రమ్హానందం, ఆలి,  ఎవియస్, వేణుమాధవ్, కృష్ణభగవాన్  వరకు హీరోలుగా  చేసిచూసినవారే. హీరొ  అవకాశాలు  తగ్గగానే తమ పాత హాస్య పాత్రలు చేయడానికి వెనుదీయలేదు.సునీల్ పరిస్తితి వీరికి పూర్తి భిన్నంగా వుంది. గత ఏడు సంవత్సరాలుగా "మర్యాద రామన్న" స్థాయి హిట్ సాదించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.  ఈ క్రమంలో యువ హీరొలు కూడా వెనుకంజ వేస్తున్న సిక్స్ పాక్ బాడీ షేప్ కూడా  సాధించాడు.   కానీ విజయం  అందని  ద్రాక్ష అయ్యింది. ఇటు ప్రక్క ఎంతమంది హాస్యనటులు వస్తున్నా సునీల్ లేని లోటు తెలుగు సినీ హాస్య ప్రప్రంచంలో అలాగే వుంది. ప్రస్తుతం పృద్వి,వెన్నెల కిషోర్ లాంటి వాళ్ళు కొద్దో గొప్పో ఆదరణ పొందుతున్నా సునీల్ వెలితి కొట్టవచ్చినట్లు తెలుస్తూనే వుంది. సునిల్ చిరకాల మిత్రుడు త్రివిక్రం ఎందుకు సునీల్ కు హీరోగా అవకాశం ఇవ్వడం లేదన్నది అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. త్వరలో విడుదల కానున్న "వుంగరాల రాంబాబు" పై సునీల్ భారీ అంచనాలతో వున్నాడు. తెలుగు ప్రేక్షకులుగా మనం కూడా ఒక మంచి విజయం సునీల్ అందుకోవాలని కాంక్షిద్ధాం. ఏది ఏమైనా హీరొ పాత్రలతో పాటుగా, అప్పుడప్పుడైనా సునీల్ హాస్యపాత్రలు చేస్తుండాలని కోరుకొనే తెలుగు పేక్షకులు కోట్లలో  వున్నారనడంలో  ఎటువంటి సందేహం  లేదు.       

31, జులై 2017, సోమవారం

"సంపూ" పై నెటిజన్ల ఆగ్రహం ఎంతవరకు సమంజసం....???

 

       అసలు పేరు నరసింహాచారి. సినిమా పేరు సంపూర్నేష్ బాబు. పరిశ్రమ, ప్రేక్షకులు పెట్టుకున్న ముద్దు పేరు "సంపూ". వెండితెరపై కొద్ది సేపు కనిపించే ఎంత చిన్న వేషం అయినా వెయ్యిడానికి సిద్ధ పడిన నరసింహాచారి కి - స్టీవెన్ శంకర్ అనే దర్శకుడి రూపం లో "హృదయ కాలేయం" అన్న చిత్రం ద్వారా హీరో గా అదృష్టం తలుపు తట్టింది. బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు గా గుర్తింపు, ప్రముఖ నటుడు మోహన్ బాబు నిర్మాణ సంస్థ చిత్రం లో హీరో స్థాయి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. "బిగ్ బాస్" రియాలిటీ షోలో పార్టిసిపెంట్ గా అవకాశం రావడం ద్వారా "సంపూ" ని మరోసారి అదృష్టం వరించింది. ఎంతో ఉత్సాహంగా హౌస్ లోనికి వెళ్ళిన సంపూ, పది రోజులలోనే అక్కడ ఉండలేక బలవంతం గా బయటకి వచ్చేసాడు. దానితో సామజిక వేదికలపై నెటిజన్లు సంపూని విపరీత వ్యాఖ్యలు, తిట్లతో దుమ్ము ఎత్తి పోశారు. ఈ విషయాన్నీ నిన్నటి ఎపిసోడ్ లో సంపూర్నేష్ బాబు ప్రస్తావిస్తూ విలపించడం, వ్యాఖ్యాత తారక్ తో పాటుగా ప్రేక్షకులను కూడా కదిలించింది. పెద్ద పెద్ద స్టార్స్ గా నీరాజనాలు అందుకుంటున్న సినీ పరిశ్రమ వ్యక్తులే చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో ఇరుక్కుంటున్న రోజులివి. ఒక మారుమూల గ్రామం నుండి వచ్చిన అతి సాధారణ వ్యక్తి, అదృష్ట వశాత్తు హీరోగా పేరు గడించిన వ్యక్తి - అన్ని వేళల వీరోచితంగా వుండాలని ఆశించడం, అలా లేకపోతే దూషించడం ఎంత వరకు సమంజసం....?? ఎంతటి మానసిక బలవంతులనైన కాలం కొన్ని పరిస్థితులలో దుర్బలులను చేస్తుందన్నది జగమెరిగిన సత్యం. అటువంటిది సంపూ మాత్రం ఏపాటి...!!! ఇకనైన సంపూ మానసిక పరిస్థితిని అర్ధం చేసుకొని నెటిజన్లు శాంతిస్తారని ఆశిద్దాం.

"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం

కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్.  అన్నయ్య సూర్య "సింగం&quo...