11, అక్టోబర్ 2017, బుధవారం

అలుపేలేని నటనకు కేరాఫ్ అడ్రస్

సాధారణంగా ఏ ఉద్యోగానికైనా రిటైర్మెంట్ వయసు 58-60 సంవత్సరాలు.  ఆ లెక్కన చూసుకుంటే అమితాబ్ బచ్చన్ రిటైర్ అయి 15 సంవత్సరాలు అవుతుంది.  75 సంవత్సరాల వయసులో కూడా 25  సంవత్సరాల కుర్రాడిలా ఇటు సినిమాలు,  అటు టి.వి షోలతో బిజీగా వున్నారు. 1969లో చిత్ర రంగ ప్రవేశం చేసిన అమితాబ్, సాథ్ హిందుస్థానీ చిత్రంతో మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను అందుకున్నారు. 1973లో వచ్చిన "జంజీర్" అమితాబ్ కు స్టార్డం తెచ్చి పెట్టింది. అదే సంవత్సరం జయభాధురితో వివాహం జరిగింది.1975 సంవత్సరం అమితాబ్ కు గొప్ప మలుపు ఇచ్చిన సంవత్సరంగా నిలిచిపోయింది. "దీవార్" తో మరోసారి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకోవడమే కాకుండా "షోలే" రూపంలో భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన బంపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. సూపర్ స్టార్ ఇమేజ్ తో పాటు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలివుడ్ లో అమితాబ్ కు ఎదురేలేక పోయింది. 1982 లో "కూలీ" షూటింగ్ సందర్భంగా తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి విజయుడిగా  నిలిచారు. సాక్ష్యాత్ దేశ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి అమితాబ్ చికిత్సపై డాక్టర్స్ ను ప్రత్యేకంగా సంప్రదించారంటే అమితాబ్ ప్రాముఖ్యత అర్ధమౌతుంది. ఇందిరా గాంది మరణం తదుపరి ఆమె కుమారుడు రాజీవ్ గాంధి విజ్ణప్తి పై కాంగ్రెస్ పార్టీలో చేరి,  ఉత్తర్ ప్రదేశ్ నుండి ఎం.పి గా ఎన్నికయ్యారు. రాజకీయాలు తనకు సరిపడని అంశమని కొద్ది కాలంలోనే బయటకు వచ్చేసారు.   సెకండ్ ఇన్నింగ్స్ లో "షెహన్ షా", "హం", "అగ్నిపత్", "ఖుదాగవా"  చిత్రాలతో తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. "అగ్నిపత్" లో నటనకు గాను మొట్ట మొదటిగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. తరువాత కొన్ని పరాజయాలు పలకరించడంతో మళ్ళీ విరామం తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో అమితాబ్ ప్రారంభించిన "ఎబిసిఎల్" మొదట్లో బాగానే వున్నా, తదుపరి తీవ్ర నష్టాలలో కూరుకు పోయింది. మరల 2000 నుండి వయసు మీరిన పాత్రలతో నటిస్తుండడం, మరో ప్రక్క "కౌన్ బనేగా కరోడ్పతి" టివి షో వ్యాఖ్యాతగా విషేషంగా రాణిస్తూ ఆర్ధికంగా కూడా నిలదొక్కుకున్నారు. 2005లో "బ్లాక్", 2008 లో "పా", 2015 లో "పీకు" చిత్రాలలోని పాత్రలకుగాను బెస్ట్ ఏక్టర్ గా నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. మొత్తంగా నాలుగు నేషనల్ అవార్డ్స్,  పదిహేను ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తీసుకోవడమే కాకుండా, "సూపర్ స్టార్" అన్న పదానికి సార్ధకత చేకూర్చారు అమితాబ్. నేడు 75 వ జన్మదినం జరుపుకొంటున్న అమితాబ్ కు భారతీయ సినీ పరిశ్రమ ఘనంగా శుభాకాంక్షలు పలుకుతుంది.       

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం

కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్.  అన్నయ్య సూర్య "సింగం&quo...