30, ఆగస్టు 2017, బుధవారం

ఆ కుటుంబానికి సినిమాయే ప్రపంచం, ప్రేమ, ప్రాణం.

ఎవరైనా సినిమా రంగాన్ని ప్రొఫెషన్ గా ఎంచుకుంటాను అంటే చుట్టు ప్రక్కల వారి ప్రతిస్పందన ఎలా వుంటుంది? పోయి,పోయి ఇదేం నిర్ణయం రా బాబు అంటుంటారు సాధారణంగా.  ఎందుకంటే ఆ రంగంలో స్థిరత్వం సాదించడమన్నది బహు కష్టం.   వేలాది మంది సంవత్సరాలుగా కష్టపడుతున్నా,  వారిలో పదుల సంఖ్యలో గుర్తింపు తెచ్చుకోవడం గఘనం అవుతుంది.  ఒక వేళ విజయం సాధించినా అది నిలబెట్టుకోవడం మరో యజ్ఞం. విజయాలే కొలమానం ఇక్కడ. వరుస విజయాలు సొంతమౌతున్నా,  ఒక్క అపజయం జీవితాలను తారు మారు చేస్తుంది. అందుకే సినీ పరిశ్రమకు వెళ్ళాలనుకునే వారికి అంతగా ప్రోత్సాహం లభించదు.  అటువంటిది కుటుంబానికి కుటుంబమే సినిమా రంగంతో మమేకమైపోయి, అంతర్జాతీయ స్థాయి   చిత్రాలను అందించి దేశమే గర్వపడేలా చేస్తున్నారు.  ఆ కుటుంబమే ఎస్.ఎస్.రాజమౌళి కుటుంబం.  తొలుతగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితగా నిలదొక్కుకున్నారు. తదుపరి అన్నయ్య ( పెద్దమ్మ కుమారుడు ) ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా పేరుగడించారు. ఆ మార్గంలోనే పయనించి సోదరి ఎం.ఎం. శ్రీలేఖ సింగర్,మ్యూజిక్ డైరెక్టర్ గా స్థిరపడింది. తరువాత రాజమౌళి దర్శకుడుగా,మరో సోదరుడు కల్యాని మాలిక్ సంగీత దర్శకుడుగా రాణిస్తున్నారు. కీరవాణి భార్య శ్రీ వల్లి లైన్ ప్రొడ్యూసర్, రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూం డిజైనర్ గా వారి వంతు పాత్రలు పోషిస్తున్నారు. ఇక కీరవాణి కుమారుడు కాల భైరవ సింగర్ గా (దండాలయ్యా..బాహుబలి సాంగ్),  రాజమౌళి కుమారుడు కార్తికేయ అసిస్టెంట్ డైరెక్టర్, కాస్ట్యూం డిసైనింగ్, ప్రొడక్షన్ విభాగాలలో పనిచేసి ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా స్థిరపడుతున్నారు. రాజమౌళి మరో కజిన్ ఎస్.ఎస్.కంచి టివి,సినిమాల రచయిత- నటుడుగా కొనసాగుతూనే ఇటీవల దర్శకుడిగా కూడా మారాడు.  ఇలా రాజమౌళి కుటుంబం మొత్తం సినిమాయే జీవితంగా కొనసాగుతూ "బాహుబలి" లాంటి అంతర్జాతీయ స్థాయి చిత్రాలను దేశానికి అందించారు. మనం చేసే పనిపై దృఢమైన నమ్మకం,శ్రద్ధ, అంకితభావం వుంటే ఎంతటి విజయాలు సొంతం అవుతాయో నిరూపించారు.    

25, ఆగస్టు 2017, శుక్రవారం

ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరమైన " అర్జున్ రెడ్డి"

ఏవడే సుబ్రహ్మణ్యం, పెళ్ళి చూపులు, ద్వారక  చిత్రాలతో మరో మంచి యువ కథానాయకుడుగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజా చిత్రం " అర్జున్ రెడ్డి " భారీ అంచనాల మద్య విడుదలైంది. 1.50 కోట్ల బడ్జెట్ చిత్రాన్ని, ఎక్స్లెంట్ ప్రమోషన్,  హైప్ క్రియేషన్ తో 6 కోట్ల బిజినెస్ చేసిన నిర్మాతలు - ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేక పోయారు  అని పరిశ్రమ వర్గాలు  అంటున్నాయి.  అగ్ర హీరొల రేంజ్ లో ఈ సినిమా విరివిగా ప్రీమియర్ షోలు ప్రదర్శింపబడింది.  సినిమాకు సెన్సార్ బోర్డ్ వారు "ఏ" సర్టిఫికెట్ ఇవ్వడంలో ఏ మాత్రం తప్పులేదంటున్నారు ప్రేక్షకులు.  కేవలం యూత్ ని దృష్టిలో పెట్టుకొని తీసిన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్ సహనాన్ని పరిక్షించేవిగా వున్నాయంటున్నారు. ఇప్పటికీ "ఫిదా" లాంటి హృద్యమైన ప్రేమ కథ చూసిన మూడ్ లోనే వున్న తెలుగు ప్రేక్షకులు ఈ విపరీత భగ్న ప్రేమను ఎంత వరకు ఆదరిస్తారు అన్నది అనుమానాస్పదమే. డబ్బింగ్ చిత్రాలు వివేకం, వీఇపి 2 లు పూర్తిగా నిరాశపరచడం, పండుగ  సెలవులు  " అర్జున్ రెడ్డి " కి మంచి రెవెన్యూ సాధించి పెడుతున్నా, సోమవారం నుండి కలెక్షన్స్ పై తీవ్ర ఆందోళనలో వున్నారు పంపిణీదారులు.  అర్జున్ రెడ్డి ఆశాభంగం తదుపరి చిన్న చిత్రాల మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు వున్నాయంటున్నాయి వాణిజ్య శ్రేణులు.     

24, ఆగస్టు 2017, గురువారం

సైరా నరసింహారెడ్డి లో అమితాబ్

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా నిర్మితం కానున్న చిత్రానికి" సైరా నరసింహారెడ్డి " గా పేరు ప్రకటించారు. తొలి స్వాతంత్ర్య పోరాట యోధుడుగా వినుతికెక్కిన వుయ్యలవాడ  నరసింహారెడ్డి  వీరగాధను నిజానికి చిరంజీవి 150 వ చిత్రంగా అనుకున్నా, కార్య రూపం దాల్చ లేదు. సురేందర్ రెడ్డి దర్శక భాద్యతలు వహిస్తున్న ఈ చిత్రం బాహుబలి తదుపరి అత్యధిక వ్యయం కానున్న తెలుగు చిత్రంగా నిలవబోతున్నది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కీలక పాత్ర పోషించనుండగా, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార తదితర అగ్ర తారాగణం ఇప్పటికి ప్రకటించబడిన తారాగణం. వివిధ ప్రాంతీయ భాషలతో పాటుగా హిందీలో కూడా విడుదల చేయాలన్న ఆలోచన కారణంగా మరింత మంది భారీ తారాగణం ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కొలువుతీరనున్నారు. ఏ.  ఆర్. రెహమాన్ సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ కానున్నది.     

8, ఆగస్టు 2017, మంగళవారం

సినిమాలకు తాత్కాలిక విరామం ఆలోచనలో "పవన్ కళ్యాణ్"....!

                 2014 ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినా, సంస్థాగత నిర్మాణం జరగనందున అప్పటి ఎన్నికలలో TDP + BJP కూటమికి పరోక్ష మద్దతు ప్రకటించి వారి విజయం లో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత కూడా సినిమాలు చేస్తూనే - మరోప్రక్క అవసరమైన సందర్బాలలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. 2019 ఎన్నికలలో జనసేన ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ - ఆ దిశలో మొదటి అడుగుగా జిల్లా స్థాయి నుండి క్యాడర్ ను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. ఒకప్రక్క సినిమాలు, మరోప్రక్క పార్టీ సంస్థాగత నిర్మాణం వ్యవహారాలు చూసుకోవడం పవన్ కు క్లిష్టతరంగా మారింది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న చిత్రం షెడ్యూల్  కూడా ఇందువలనే ఆలస్యం అవుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జనసేన పార్టీ వ్యూహరచనలో తెరవెనుక ప్రదాన పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. ఎన్నికల రంగానికి మరి ఎంతో సమయం లేనందున ప్రస్తుత చిత్రం పూర్తి అయిన తదుపరి మరి ఏ సినిమా చెయ్యకూడదు అన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ వున్నట్లుగ సన్నిహిత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ నిర్ణయమే నిజమైతే ప్రస్తుత చిత్రం తరువాత మరో మూడు నాలుగు సంవత్సరాల వరకు పవన్ చిత్రం వుండే అవకాశం లేదు. ఇది పవన్ అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమకు ఎంతో నిరాశ కలిగించే విషయమే. కాకపోతే అభిమానులు మాత్రం పవన్ ను తరచుగా, ప్రత్యక్షంగా ప్రజల మధ్యే చూసుకొని మురిసిపోవచ్చు సుమా...!!


5, ఆగస్టు 2017, శనివారం

సునీల్ కు ఎంత పని చేసావు "మర్యాద రామన్న" ..?

2000 సంవత్సరంలో చిత్ర పరిశ్రమకు పరిచయమైన సునీల్ దాదాపు దశాబ్దం పాటు హాస్య చక్రవర్తిగా ఒక వెలుగు వెలిగాడు. పరిశ్రమకు వచ్చిన సంవత్సర కాలానికే వుత్తమ హాస్య నటుడిగా ( నువ్వు నేను ) రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం అందుకున్నాడు. దర్సకుడు త్రివిక్రం శ్రీనివాస్, సునీల్ ఒక వూరి (భీమవరం) వాళ్ళే. అందులోనూ  కాలేజ్ మిత్రులు కావడంతో - పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో కూడా ఒకే రూంలో వుండే వారు. త్రివిక్రం మాటల రచయతగా అవకాశాలు  దక్కించుకొవడానికి సునీల్ సహాయపడగా - సునీల్ కు తను చేస్తున్న దర్శకులకు చెప్పి పాత్రలు ఇప్పించడానికి త్రివిక్రం  దోహదపడ్డారు. . అప్పటికే సినీ హాస్య ప్రపంచాన్ని దశాబ్దంపైగా మకుటంలేని మహారాజులా  ఏలుతున్న  బ్రమ్హానందంకు తగ్గ వారసుడు  వచ్చాడని  ప్రేక్షకులు ఆనందించారు. ప్రతి దర్శకుడు,హీరో తమ చిత్రంలో సునీల్ వుండాలని ప్రత్యేకించి పాత్రలు సృష్టించేవారు. సంవత్సరానికి 20-25 సినిమాలు చేసే పరిస్తితులు  వుండేవి.  తనదైన ప్రత్యేక మేనరిసంతో పాత్రలకు మరింత న్యాయం  చేకూర్చే వాడు. 2006 సంవత్సరంలో "అందాలరాముడు"గా  హీరోగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం  చేసుకున్నాడు. ఆ తదుపరి కూడా హాస్య పాత్రలే  చేసుకుంటు  వచ్చాడు. 2010 లో రాజమౌళి దర్శకత్వం లో సునీల్ హీరొగా వచ్చిన "మర్యాద రామన్న" సూపర్ హిట్ కావడం - సునీల్ హాస్య శకానికి ముగింపు పలికిందని చెప్పొచ్చు. అభిమానుల  ఆకాంక్షో, శ్రేయోభిలాషుల   సలహానో, లేక సునీల్ స్వంత నిర్ణయమోగాని - అప్పటినుండి సునీల్ పూర్తి స్థాయి హీరొగా నిలదొక్కుకోవాలనే దిశలో నెమ్మదిగా, పూర్తిగా హాస్య పాత్రలకు ఫుల్ స్టాఫ్ పెట్టేశాడు. హాస్య నటులు హీరొలుగా ప్రయత్నించడం అన్నది అనాదిగా వస్తున్నదే అయినా, ఎవరూ పూర్తిస్థాయిలో హీరోలుగా నిలదొక్కుకోలేదు.

 చంద్ర మోహన్, రాజేంద్రప్రసాద్, నరెష్, శ్రీకాంత్ తదితరుల పరిస్తితి వేరు. వారు ముందు హీరొలుగా నిలదొక్కుకొని తదుపరి హాస్య కదానాయకులుగా ఆదరణ  పొందారు. నాటి రేలంగి,పద్మనాభం,చలం,రాజబాబులు నుండి నేటి బ్రమ్హానందం, ఆలి,  ఎవియస్, వేణుమాధవ్, కృష్ణభగవాన్  వరకు హీరోలుగా  చేసిచూసినవారే. హీరొ  అవకాశాలు  తగ్గగానే తమ పాత హాస్య పాత్రలు చేయడానికి వెనుదీయలేదు.సునీల్ పరిస్తితి వీరికి పూర్తి భిన్నంగా వుంది. గత ఏడు సంవత్సరాలుగా "మర్యాద రామన్న" స్థాయి హిట్ సాదించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.  ఈ క్రమంలో యువ హీరొలు కూడా వెనుకంజ వేస్తున్న సిక్స్ పాక్ బాడీ షేప్ కూడా  సాధించాడు.   కానీ విజయం  అందని  ద్రాక్ష అయ్యింది. ఇటు ప్రక్క ఎంతమంది హాస్యనటులు వస్తున్నా సునీల్ లేని లోటు తెలుగు సినీ హాస్య ప్రప్రంచంలో అలాగే వుంది. ప్రస్తుతం పృద్వి,వెన్నెల కిషోర్ లాంటి వాళ్ళు కొద్దో గొప్పో ఆదరణ పొందుతున్నా సునీల్ వెలితి కొట్టవచ్చినట్లు తెలుస్తూనే వుంది. సునిల్ చిరకాల మిత్రుడు త్రివిక్రం ఎందుకు సునీల్ కు హీరోగా అవకాశం ఇవ్వడం లేదన్నది అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. త్వరలో విడుదల కానున్న "వుంగరాల రాంబాబు" పై సునీల్ భారీ అంచనాలతో వున్నాడు. తెలుగు ప్రేక్షకులుగా మనం కూడా ఒక మంచి విజయం సునీల్ అందుకోవాలని కాంక్షిద్ధాం. ఏది ఏమైనా హీరొ పాత్రలతో పాటుగా, అప్పుడప్పుడైనా సునీల్ హాస్యపాత్రలు చేస్తుండాలని కోరుకొనే తెలుగు పేక్షకులు కోట్లలో  వున్నారనడంలో  ఎటువంటి సందేహం  లేదు.       

"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం

కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్.  అన్నయ్య సూర్య "సింగం&quo...