28, జులై 2017, శుక్రవారం

నాటి సినిమా హాళ్ళు - నేటి ఆనవాళ్ళు...పూర్ణ ధియేటర్(వైజాగ్)

            దక్షిణాదిలో నిర్మితమైన తొలి తరం సినిమా హాళ్ళలో వైజాగ్ లోని పూర్ణ ధియేటర్ ఒకటి. 1927 లో సి.పుల్లయ్య మరియు జి.కె.మంగరాజు ల భాగస్వామ్యంలో తొలుత శ్రీ కృష్ణా పిక్చర్ ప్యాలెస్ గా నిర్మితమైనది. సి.పుల్లయ్య సినీ పరిశ్రమకు తరలి వెళ్ళి దర్శకుడిగా స్థిర పడిపోవడంతో - 1930 లో పూర్ణ ధియేటర్ గా పేరు మార్పుచెంది మంగరాజు పూర్తి యాజమాన్యంలోకి వచ్చింది.
1949 లో నూతనంగా నిర్మించిన బాల్కనీ - "లైలా మజ్ను" చిత్రంతో పాటు గా, ఆ చిత్రం లో హీరొయిన్ గా నటించిన భానుమతి రామకృష్ణ తో ప్రారంభోత్సవం జరుపుకుంది. తదుపరి ధియేటర్ రంగం లో వచ్చిన సాంకేతిక మార్పులను అన్వయించుకుంటూ ప్రేక్షకులను దశాబ్దాలు గా అలరించింది. ఒకానొక దశలో ఒక్కసారిగా పుంజుకున్న సాంకేతిక వేగాన్ని అందుకోలేక కొద్ది కొద్దిగా వెనుకంజలో పడింది. ఒక ప్రక్క మల్టిప్లెక్స్ లు, మరోప్రక్క కేబుల్ టీవీ ప్రభావాలను తట్టుకొని నిలబడిన పూర్ణ ధియేటర్ 2015 సంవత్సరం లో మూతపడింది. దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా విశాఖ ప్రేక్షకులను అలరించిన పూర్ణ ధియేటర్ వైభవం నేడు గత చరిత్ర ఆనవాళ్ళు గా మిగిలిపోయింది. సమీపంలోని సర్దార్ వల్లభాయ్ మార్కెట్ పేరు పూర్ణ మార్కెట్ గా రూపాంతరం చెంది విశాఖ చరిత్రలో దేదీప్యమానంగా వెలుగుతుంది. ఈ ధియేటర్ లో సినిమాలు చూసిన ప్రేక్షకులారా...! నాటి జ్ఞాపకాలలో మునిగిపోయారా...? ఈ ఆనవాళ్ళు కూడా గత జ్ఞాపకాలు గా మారిపోయే కాలం మరెంతో దూరంలో లేదు. వ్రేళ్ళ మీద లెక్కించగలిగేలా మాత్రమే మిగిలి ఉన్న అలనాటి సినిమా హాళ్ళను పరిరక్షించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ నడుంబిగించాల్సిన  ఆవశ్యకత ఉంది. ఈ ఆశయం కార్యాచరణలోకి వస్తే తెలుగు సినిమా ప్రేక్షకుల ఆనందానికి హద్దేముంటుంది...!

23, జులై 2017, ఆదివారం

అద్దాలమేడలు - సినిమా జీవితాలు

ప్రశాంతంగావున్న వాతావరణంలోనే తన వ్యాఖ్యలతో ప్రకంపనలు సృష్టించే రాంగోపాల్ వర్మ ఇలాంటి సమయంలో నిశ్శబ్దంగా ఎలా వుంటాడు. ట్వీటాడు.. ఆబ్కారిశాఖని టార్గెట్ చేసుకుని ట్వీటాడు....వివాదాలు చెలరేగేలా ట్వీటాడు. 'సినిమావాళ్ళను విచారిస్తున్నట్లుగా విద్యార్ధులను కూడా విచారిస్తారా? సినిమా టీజర్ లా పేర్లు లీక్ లు చేస్తున్నారా?  అకున్ సబర్వాల్ ని పెట్టి బాహుబలి3 తీయాలా?' ఇలా...  విచారణ సంస్థ మీద ఈ తరహా వ్యాఖ్యలను "మా"అసోసియేషన్ కూడా ఖండించింది .ఆ శాఖ సంబందిత వ్యక్తులు వర్మమీద కేసులు వేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయినా వర్మకు కేసులు కొత్త కాదనుకోండి. సినిమా వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్స్తున్నారు అని పరిశ్రమ వాళ్ళు కొందరు ఇలానే అడుగుతున్నారు.  సినిమా అంటేనే అంత.  అదో వ్యామోహం మనకు . అదో పిచ్చిఇంకేందరికొ.. ! మంచి అయినా, చెడు అయినా ఇక్కడున్న క్రేజ్ మరెక్కడా రాదు. పువ్వులు వేసిన చేతులే రాళ్ళు వేస్తాయి. గుళ్ళు కట్టిన వాళ్ళే కూల్చేస్తారు. స్టార్ డం ఇక్కడ శాశ్వతం కాదు అన్న. అప్రమత్తతో, క్రమశిక్షణతో వున్న వాళ్ళే ఎక్కువకాలం పయనిస్తారు, విజయాలను ఆస్వాదిస్తారు. సినిమా వాళ్ళ జీవితాలు 'అద్దాల మేడ 'లు అని  కీ. దాసరి నారాయణ రావు ఎప్పుడో సినిమా తీసి చూపించారు. ఇన్ని రంగుల అందాల ప్రపంచం ఒక్క గులక రాయి దెబ్బకు బీటలు వారుతుంది. ఈ గ్రహణం త్వరలోనే వీడిపోతుందని,మంచి ముత్యంలా ఈ వ్యవహారం నుండి తెలుగు సినిమా  బయటపడుతుందని తెలుగు సినిమా ప్రేక్షకులుగా మనం ఆశిద్దాం. ఇంకొ ముఖ్య విషయం మరిచి పోయాం.ఈ 'మత్తు ' వ్యవహారం వెలుగు చూసిననాటినుండి ఒక వ్యక్తి పేరు బయటకు వస్తుందని చాలా మంది వూహించారు. ఆయనే రాం గోపాల్ వర్మ. ఎవరేం అనుకున్నా తనకునచ్చినట్లు బతకడం, విలాసజీవితానికి కేరాఫ్ అడ్రస్ అవ్వడం, ముంబయ్ చిత్ర పరిశ్రమతో దగ్గరి సంబందాలు వుండడం ఈ వూహగానాలకు కారణం. ఈ జాబితాలొ ఆయన శిష్యులు వుండడం కొసమెరుపు.      

21, జులై 2017, శుక్రవారం

ప్రేక్షకులు "ఫిదా" అయ్యారు...!

తొలినాళ్ళలో ఆనంద్, గోదావరి, హ్యాపిడేస్ వంటి క్లాసికల్ టచ్ చిత్రాలతో కమర్షియల్ హిట్స్ సాధించిన దర్శకుడు శేఖర్ కమ్ముల తదుపరి ఆ హవా కొనసాగించలేకపొయాడు.ఈయన తన చిత్రాలలో ఫ్రెష్ ఫీల్ తో పాటు, ఫ్రెష్ లుక్ నటులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇటువంటి దర్శకుడి నుండి మళ్ళీ ఒక మంచి చిత్రానికై ప్రేక్షకులతోపాటు పరిశ్రమ కూడా ఎదురుచూసేది.చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యి మూడేళ్ళు అవుతున్నా, "కంచె" తో నటుడిగా సంతృప్తి తప్పించి ఒక్క కమర్షియల్ హిట్ లేదే అని తపిస్తున్న హీరో 'వరుణ్ తేజ్'.  ఈ ఇరువురి కాంబినేషన్ లో విజయాలని తన విలాసంగా మార్చుకున్న 'దిల్ ' రాజు "ఫిదా" రూపంలో ఒక ఫీల్ గుడ్ మూవీని అందించారు. శేఖర్ కమ్ముల తన తొలి చిత్రాల స్తాయి లయ మళ్ళీ దొరకబుచుకున్నాడని ప్రేక్షకులు
అంటున్నారు. శేఖర్ కమ్ముల చిత్రాలలో హీరోయిన్, మ్యూజిక్ కు ఎంత ప్రాధాన్యం వుంటుందో మనకు తెలిసిన విషయమే. అదే తరహాలో ఈ చిత్రంలో కూడా హీరోయిన్ సాయి పల్లవి సహజ నటనతో మంచి మార్కులు సంపాదించగా, సాంగ్స్ కూడా కనువిందుగా, వినసొంపుగా అలరిస్తున్నాయంటున్నారు. వరుణ్ తేజ్ కు నటనపరంగానే కాకుండా, కమర్షియల్ గా కూడా "ఫిదా" మంచి సక్సెస్ ని ఇస్తుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దీనితో శేఖర్ కమ్ముల కు బ్యాక్ టు "హ్యాపీ డేస్ ".

19, జులై 2017, బుధవారం

జూ. ఎన్.టి.ఆర్ (+) కంటెస్టెంట్స్(-) = బిగ్ బాస్

గత కొద్ది రోజులుగా తెలుగు టి.వి. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతతో ఎదురు చూసిన స్టార్ మా చానెల్ 'బిగ్ బాస్' రియాలిటీ షో ఎన్.టి.ఆర్. వ్యాఖ్యాతగా  గ్రాండ్ గా ఆరంభం జరుపుకుంది. కాకపొతే కంటెస్టెంట్స్ విషయంలో భారీ అంచనాలతో ఉన్న వీక్షకుల ఆశలపై  మాత్రం మా ఛానెల్ వారు నీళ్ళు గుమ్మరించారు. ఎన్.టి.ఆర్. ని వ్యాఖ్యాతగా ప్రకటించడం వల్ల గాని,  విపరీత ప్రచారం వల్లనైతే గాని, పాటించిన గోప్యత  కారణం గా కానీ - ఫైర్ బ్రాండ్ సెలబ్రటీస్  తో బిగ్ బాస్ హౌస్ పొగలు - సెగలు కక్కుతుంది అని వీక్షకులు ఊహాగానాలలో తేలిపోయారు. బిగ్ బాస్  కంటెస్టెంట్స్ దాదాపు అందరూ సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న వారే అయినా, ఏ ఒక్కరూ స్టార్ ఎట్రాక్షన్ ఉన్న వాళ్ళు కాకపోవడం తో వీక్షకులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ప్రస్తుతానికి జూ.ఎన్.టి.ఆర్. చరిష్మా తో ఆరంభం అదిరిపోయినా, భవిష్యత్ ను వీక్షకులు ఎలా నిర్ణయిస్తారో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. 

18, జులై 2017, మంగళవారం

నాని.....మినిమం గారంటీ..!


భలే భలే మగాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, జెంటిల్ మెన్, మజ్ను, నేను లోకల్ - ఇప్పుడు 'నిన్ను కోరి ' తో 6 వ విజయం తన ఖాతా లో వేసుకున్నాడు నాని. సినిమారంగం లో ఒక్క మంచి విజయం కోసం, ఎందరో, ఎన్నాళ్ళు గానో పడిగాపులు కాస్తున్నారు. చాపకింద నీరులా ఒకదాన్ని  మించి మరో విజయం సాదిస్తూ, చిత్రపరిశ్రమ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇన్ని విజయాలు సొంతం చేసుకున్నా-  ఎటువంటి వివాదాలు, ఆడంబరాలు దరి చేరకుండా, క్రమశిక్షణ తో తన పని తానూ చేసుకుపోతున్నాడు. నాని సినిమా అంటే మినిమం గారంటి  దర్శక, నిర్మాతలకే కాదు, ప్రేక్షకులకు కూడా.  ప్రస్థుతం 30 కోట్ల కలెక్షన్స్ కు  చేరువైన  'నిన్నుకోరి'  చిత్రం నాని చిత్రాల్లోకెల్లా  టాప్ గా నిలుస్తుందని  పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.  

డివైడ్ టాక్..... అయిన 100 కోట్ల క్లబ్ లో 'DJ'

 విడుదలకు ముందు, తరువాత వివాదాలు ఎదుర్కున్న 'DJ' దువ్వాడ జగన్నాధం. డివైడ్ టాక్ తో కూడా 100 కోట్ల కలెక్షన్స్ క్లబ్ కు చేరువయ్యింది. కొందరు చెపుతున్నట్లుగా 120 కోట్లు, 130 కోట్లు కలెక్షన్స్ వాస్తవం కాదని, ప్రస్తుతం 90-95 కోట్ల కలెక్షన్స్ సాధించిందని , మొత్తంగా 100 కోట్ల కు చేరవచ్చు అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితులలోను  ఇలాంటి కలెక్షన్స్ వచ్చాయి అంటే, పాజిటివ్ రెస్పాన్స్ ఉంటే 150 కోట్లు కు  చేరుకునేది  అంటున్నారు.  పెరిగిన టికెట్ రేట్లు, అల్లు అర్జున్ మార్క్ గ్రాండ్ ఓపెనింగ్స్- నిర్మాత, పంపిణీదారులను నిలబెట్టాయని, ఇది అల్లు అర్జున్ స్టామినాకు నిదర్శనం అని కితాబు ఇస్తున్నారు.

14, జులై 2017, శుక్రవారం

అందమైన లోకమని...!!!

                  ప్రపంచాన్నిఉర్రూతలూగించే వినోద సాధనాలలో సినిమాదే అగ్రతాంబూలం. మన దేశంలో, అందులోను దక్షిణాదిలో దీని ప్రభావం మరింత ఎక్కువ. సినీతారలను కుటుంబసబ్యులకంటే ఎక్కువగా ప్రేమించడం, దేవతలుగా గుళ్ళు కట్టి పూజించడం, వారికి ఏ చిన్న హాని జరిగిన మనస్తాపంతో ఆత్మార్పణలు చేయడం వంటి ఘటనలు సర్వసాధారణం. సినీరంగానికి చెందినవారు ముఖ్యమంత్రులు, మంత్రులు మరియు ఇతర పాలనా పదవులు చేపట్టిన ఘటనలు కోకొల్లలు. వారి జన్మదిన వేడుకలలో రక్తదానాలు, అన్నదానాలు, పాలాభిషేకాలకు కొదువేలేదు. సినీతారల కనుసైగలతో దశాబ్దాల రాజకీయ ఘన చరిత్రలు గల పార్టీలు కూడా గల్లంతు అవుతాయి. అది సినిమా రంగానికి ఉన్న శక్తి, ఆకర్షణ. అందుకే యువత ఈ రంగంలో "ఒక్క ఛాన్స్.... ఒకే ఒక్క ఛాన్స్...నేనేంటో నిరూపించుకుంటాను" అంటూ వెర్రెత్తిపోతుంటారు. టీవీ, ఇంటర్నెట్ ప్రసారాలు వంటివి ఎంత విస్కృతమైనా సినిమారంగానికి ఉన్న ప్రత్యేకత వేరు. గతంలో దక్షిణాది సినిమా అంటే తమిళ చిత్ర పరిశ్రమ మాత్రమే అన్న అభిప్రాయ నీడల నుండి నెమ్మదిగా బయటపడి "టాలివుడ్" గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది తెలుగు చిత్రసీమ. "బాహుబలి" చిత్రాలతో ప్రపంచ సినిమారంగమే మన వైపు ఆశ్చర్యపడి చూస్తుంటే.... తెలుగు ప్రేక్షకులుగా ఎంతో గర్విస్తున్నాం. ఇంతలోనే డ్రగ్స్ మాఫియా ఉదంతం ఆనందాన్ని ఆవిర్లు చేసింది. పరిపాలించే నాయకులు, అబిమానించే సినీతారలు వాస్తవంగా కూడా ఆదర్శంగా ఉండాలని సగటు ప్రజలు కోరుకుంటారు. ఈ వ్యవహారంలో ఇరుక్కున్నది అతి కొద్దిమంది మాత్రమే అయినా మొత్తం తెలుగు చిత్రపరిశ్రమ ఈ అపవాదును  మోయవలసి వస్తుంది. ఇప్పటికే "మా  అసోసియేషన్" దీనిపై తీవ్రంగా స్పందించింది. ఇంతటితో సరిపుచ్చకుండా ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు ఎంతటివారు అయినా వారిపై నిషేధం విదించి తెలుగు సినీ పరిశ్రమను రక్షించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ చీకట్లను త్వరలోనే చేదించుకుని మన తెలుగు తెర అంతర్జాతీయంగా మళ్ళి వెలుగులీనుతుందని ఆశిద్దాం.

"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం

కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్.  అన్నయ్య సూర్య "సింగం...